27, మే 2012, ఆదివారం

దుష్ట సమాసాలు - చర్చ


  గతంలో ఈ బ్లాగు ద్వారా అందించిన 'ఛందస్సు పాఠాలు', 'సమాస ప్రయోగాలలో గమనించవలసిన విషయాలు'... ఇప్పటికీ చాల మంది రిఫర్ చేయడం - ఆనందం కలిగిస్తూ ఉంటుంది. అయితే తరువాతి కాలంలో బిజీ అవడం వలన నేను ఆ పాఠాలను కొనసాగించలేక పోయాను.

ఆ తరువాత మిత్రులు కంది శంకరయ్య గారు అందుకొని, తమ ’శంకరాభరణం’ బ్లాగు ద్వారా ఇలాంటి పాఠాలను, చర్చలను విరివిగా అందిస్తూ విశేషమైన భాషా సేవ చేస్తున్నారు.

ఆరు నెలల క్రితం అలాంటి చర్చ ఒకటి ఆ బ్లాగులో జరిగింది. అందులో నా పాఠాల ప్రసక్తి రావడం.. ఎవరో .. రాంమోహన శర్మగారు (అజ్ఞాత) తమకు తెలిసిందే సర్వస్వమని భావించి వ్యాఖ్యానించడం జరిగింది.

ఆరు నెలల తరువాత... మొన్న నేను దానిని చూసి సమాధానం వ్యాఖ్యగా ఇచ్చాను.

అయితే అందులోని సారాంశం అందరికీ అందవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ చర్చనంతా ఇక్కడ టపా గా అందిస్తున్నాను.

రాం మోహన శర్మ గారూ! మీరు ఎక్కడున్నారో గాని ... మీరు ఇంకా ఏమయినా చర్చించాలనుకొంటే - నేను సిద్ధమే!


- డా. ఆచార్య ఫణీంద్ర



"గన్నవరపు నరసింహ మూర్తి చెప్పారు...

    శ్యామలీయము గారూ దయచేసి యీ ప్రయత్నము ఎలా ఉన్నదో పరిశీలిస్తారా !

    మింట నిండగ గాషాయ మిసిమి, పసుపు
    చంద్ర వంకయు పొడచూప జవితి దినము
    కలలు మెదలుచు మది రేప నలల నా ప్ర
    దోష కాల మొసంగు సంతోష గరిమ !
    November 28, 2011 8:50 PM

శ్యామలీయం చెప్పారు...

    నరసింహమూర్తిగారూ, మీ పద్యంలో కాషాయ మిసిమి అని వర్ణాలను విడిగా చెబుతున్నారా? అయినా యీ మాటలతో సమాసం చేయరాదు. కాషాయం సంస్కృతం. మిసిమి తెలుగు. అలాగే పసుపు చంద్రవంక అంటున్నారు. పసుపుపచ్చని చంద్రవంక అని మీ భావం అనుకుంటాను. పచ్చనిచంద్రవంక అనాలికాని పసుపు చంద్రవంక అనరాదనుకుంటాను. ఇంకా బాగా పసిమిచంద్రవంక అంటే భేషుగ్గా ఉంటుంది. చవితిదినము కన్నా చవితనాడు అన్నది బాగుంటుందని నా అభిప్రాయం. మీది గణం ప్రకారం సరైనదే.
    November 28, 2011 10:15 PM


శ్యామలీయం చెప్పారు...

    నరసింహమూర్తిగారు, 'చవితినాడు' అనేది దుష్టసమాసం కాదండీ. చతుర్ధి అనేది సంస్కృతం. చవితి అన్నమాట తెలుగే, చతుర్ధి నుండి పుట్టిన మాట. అయితే, దినము అనేది దినమ్ అనే సంస్కృత పదమే కదా. కా బట్టి చవితదినము అనేది దుష్టసమాసం . కాని చవితినాడు అనేది సరైన ప్రయోగమే.
    November 29, 2011 8:31 AM


అజ్ఞాత చెప్పారు...

    చవితి అనేది తెలుగు కాబట్టి చవితి దినము అనకూడదా ? చూడబోతే ' వినాయక చవితి ' అనేది కూడా దుష్ట సమాసమే అనేలా ఉన్నారు . అయినా తెలుగు పదం తరువాత సంస్కృతం రావచ్చని సారు గారికి తెలీదా ? ఒక వేళ చవితి తెలుగే అనుకున్నా , దినం సంస్కృతమే అయినా , తెలుగు పదం తరువాత సంస్కృతం తో సమాసం చేయవచ్చు . కాబట్టి చవితి దినము అనవచ్చు . ఇలా వచ్చీ రాని పాండిత్యంతో తప్పుడు పాఠాలు చెప్పడం మహా పాపం . అయ్యా శంకరయ్య గారు , మీ బ్లాగు కి నేనో పాఠకుణ్ణి మాత్రమే నాకు పద్యాలు రాయడం రాదు కాని అంతో ఇంతో తెలుగు వచ్చు . దయచేసి ఇలాంటి తప్పుడు పాఠాల్ని బోధింపజేయకండి సార్, మీకు పుణ్యం ఉంటుంది .
    - రాం మోహన్ శర్మ .
    November 30, 2011 12:19 PM

శ్యామలీయం చెప్పారు...

    చాలా ఆలస్యంగా గమనించాను. ఈ అజ్ఞాత గారు నన్ను మహా పాపిని చేయటం చూడటం జరిగింది. నేనేమీ పరమపుణ్యాత్ముడనని భ్రమలో లేను కాబట్టి ఆశ్చర్యపోవటం లేదు. ఎవరిక కైనా అపోహ ఉంటే మన్నించాలి. అజ్ఞాత గారు అనుమాన పడుతున్నట్లు నేనేమీ పాఠాలు చెప్పటం లేదిక్కడ. అలా చెప్పేందుకు నేను కవినీ గాను పండితుడనూ కాను. ఈ విషయం యీ బ్లాగులో వారికి ఇప్పటికే ఒకటి రెండు సార్లు విన్నవించటం జరింగింది. 'నాకు పద్యాలు రాయడం రాదు కాని అంతో ఇంతో తెలుగు వచ్చు'నని అన్నారు అజ్ఞాతగారు. నాకేమీ కవితాధార ఉట్టిపడిపోతోందన్న భ్రమ నాకేమీ లేదు. నాకు పెద్దగా తెలుగురాదని నాకు అజ్ఞాతగారు చెప్పకముందే తెలుసు, బ్లాగుమిత్రులకూ తెలుసు. తెలుగు పదం తరువాత సంస్కృతం తో సమాసం చేయవచ్చునన తెలియజేసినందుకు కృతజ్ఞుడను.
    December 02, 2011 2:11 PM

శ్యామలీయం చెప్పారు...

    సందేహ నివృత్తి కోసం యీ మహాపాపిబిరుదాంకితుడు వెబ్ ప్రపంచాన్ని గాలించటం జరిగింది. " నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం " నిర్వహణ; సంపాదకత్వం : డా. ఆచార్య ఫణీంద్ర బ్లాగులో యీ క్రింది టపా సందేహనివృత్తి చేసింది:
    http://dracharyaphaneendra.blogspot.com/2009/03/haaramcom_31.html
    సూక్ష్మంగా అక్కడి సమాచారం:
    ఆ.ఫ.:సంస్కృత పదాలను, తెలుగు పదాలను కలిపి మిశ్రమ సమాసాలు చేయడం తప్పు. పండితులు వీటిని 'దుష్ట సమాసాలు' అంటారు.......
    ఉదాహరణకు ఈ మధ్య ఏ వార్తా పత్రికను చూసినా 'పాలాభిషేకం' అని వ్రాస్తున్నారు. ఇక్కడ 'పాలు'- తెలుగు పదం; 'అభిషేకం'- సంస్కృత పదం. వీటిని సమాసం చేయకూడదు. దీనిని 'క్షీరాభిషేకం' అనాలి. .........
    అజ్ఞాతగారు నాకు పాపవిముక్తి ప్రసాదిస్తారేమో చూడాలి!
    December 02, 2011 3:01 PM

కంది శంకరయ్య చెప్పారు...

    శ్యామల రావు గారూ,
    అజ్ఞాతల వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఇంతకుముందే విజ్ఞప్తి చేసాను. గత కొన్ని రోజులుగా నేనొక సమస్యతో సతమతమౌతూ బ్లాగుకు వచ్చే వ్యాఖ్యలను పరిశీలించలేదు. లేకుంటే ఆ వ్యాఖ్యను అప్పుడే తొలగించి ఉండే వాణ్ణి. ఈ మధ్య మన బ్లాగుమీద అజ్ఞాతల దాడి తరుచుగా జరుగుతున్నది. నిజంగా ఆ రోజు జరిగిన చర్చను నిశితంగా పరిశీలించి ఉంటే అజ్ఞాత అలా వ్యాఖ్యానించి ఉండేవారు కాదేమో? ఆనాటి చర్చావ్యాఖ్యలను అజ్ఞాత పూర్తిగా చదవలేదని కచ్చితంగా చెప్పవచ్చు.
    December 02, 2011 4:38 PM

అజ్ఞాత చెప్పారు...

    పిల్లికి ఎలుక సాక్ష్యం అని ఒకటుందండి . ఈ పై నుదాహరణ అలాంటిది . ఎందుకంటే పాలాభిషేకం ఖచ్చితంగా తప్పు . అక్కడ సంధి తప్పు . అదేం పాలాభిషేకం అని సవర్ణదీర్ఘసంధి ఎలా అవుతుంది ? కాని మర్రి వృక్షము అనవచ్చు- మర్రి తెలుగు , వృక్షము సంస్కృతం , కాని సమాసం తప్పు కాదు . రూపక సమాసం .
    అక్కడ చెప్పినట్టు సంస్కృతం వచ్చిన తరువత తెలుగు పదం తో సమాసం చేస్తేనే తప్పు అవుతుంది . వృక్ష నీడ . అని అంటే అది తప్పు . రెండు వేరు వేరు పదాలైనప్పుడు , తెలుగు ముందు వచ్చిన తరువాత సంస్కృతం రావచ్చని చిన్నప్పుడే నేర్పించే బేసిక్ పాయింటు .

    పెద్ద కుమారుడు , విన్న వాక్యం , కన్న సాక్ష్యం , తీపి జ్ఞాపకం , మంచి వ్యక్తి , ఇంటి దీపం , జంట కవిత్వం ఇలా ఎన్ని పదాలు చెప్పాలండి మీకు ? అన్నింట్లో తెలుగు దాని తరువాత సంస్కృతం తో సమాసం కాలేదా ?

    సంస్కృతం తరువాత తెలుగు తో మాత్రం సమాసం చేయకూడదని తెలుసు , ప్రాణ గొడ్డము , వానర మూక ఇల్లాంటివి .
    ఇవి తెలీకుండా పాఠం చెప్పినందుకే అలా అన్నాను , ఎవరిని నొప్పించాలని కాదు. కావాలంటే మీరింకో తెలుగు పండితుడిని అడిగి సందేహం నివృత్తి చేసుకొండి . అంతే కాని తెలియని వన్ని తప్పులు అనడం తప్పే .
    అన్నట్టు నేను అజ్ఞాత కాదు - నా పేరు రాం మోహన్ శర్మ అని పైనే చెప్పాను . వృత్తిరీత్యా తెలుగు పండితుడిని కాదు కానీ అభిమానం ఈ బ్లాగు రెగ్యులర్ గా చదువుతాను . ఇంక ఇంతకంటే చెప్పడం న వల్ల కాదు. శంకరయ్యగారికి , మనసు నొచ్చుకుని ఉంటే క్షమించండి
    December 02, 2011 7:12 PM

శ్యామలీయం చెప్పారు...
    ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
    December 02, 2011 8:37 PM

శ్యామలీయం చెప్పారు...

    అజ్ఞాత/రాం మోహన్ శర్మగారూ, నా పరిమితులు నాకూ, అందరు బ్లాగు సభ్యులకూ చక్కగా తెలుసు కాబట్టి పాఠం చెబుతున్నానుకోరెవరూ. అలాగే పెద్దలను సంప్రతిస్తాను. నన్ను మహాపాపి అంటే అన్నారు కాని, డా. ఆచార్య ఫణీంద్రగారిని మీరు యెలక అనటం వింతగా ఉంది. ఈ చర్చ సమాప్తం.
    శంకరయ్యగారు: మన్నించాలి, అజ్ఞాతగారు ముఖ్యమైన చర్చనీయాంశం లేవనెత్తినందువలనే నేను స్పందించాను. ఒక రకంగా ఇది నాకు మనస్తాపం మిగిల్చింది. నావల్ల మరొక పెద్దమనిషికి చెడ్డమాట తగిలింది. ఇక ముందు మరింత జాగ్రత్త తీసుకుంటాను.
    December 02, 2011 8:42 PM

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

    గురువుగారూ,

    నాదొక చిన్న సందేహము. పైన జరిగిన చర్చలో చూస్తే, తెలుగు పదము తరువాత, సంస్కృత పదముతో సమాసము చేయవచ్చు కానీ సంస్కృత పదము తరువాత తెలుగు పదముతో సమాసము చేయలేమనివుంది.

    అప్పుడు, "పాలాభిషేకము" అనే సమాసములో "పాలు" తెలుగు పదము, "అభిషేకము" సంస్కృతపదము కదా, మరి ఎందుకు ఇది దుష్టసమాసము అయింది?? వివరించ వలసినదిగా ప్రార్థన. లేదా తెలుగుపదాలతోటి అన్యభాషా పదాలతో (సంస్కృతపదాలతో కూడా ) సమాసమెప్పుడూ దుష్టసమాసమేనా??

    గురువుగారూ, చర్చను తప్పుదోవ పట్టించేలా వుంటే ఇంకెప్పుడైన సందేహనివృత్తి చేసుకొంటాను. ఇంది ఇంతటితో వదిలేద్దాం.
    December 02, 2011 9:16 PM

శ్యామలీయం చెప్పారు...

    సంపత్కుమారులవారూ, సంస్కృతాంధ్రపదాలను యేక్రమంలోనూ కలిపి సమాసం చేయరాదని అలాచేస్తే దుష్టసమాసమని నేనూ, అలాగాక తెలుగు పదము తరువాత, సంస్కృత పదముతో సమాసము చేయవచ్చునని శ్రీ రాం మోహన్ శర్మగారూ అభిప్రాయ పడ్డాము. వాడి-వేడి ప్రక్కన పెడితే, యీ విషయంలో అందరకూ ఆసక్తి ఉంది. అపండితుడనైన నేను కూడా పెద్దలను అడిగి నిష్కర్ష చేసుకోవా లనుకుంటున్నాను. వాదనకు కాదు, అలా చేయటం వలన నా భాష మరింత పరిపుష్టం అవుతుందని.
    December 03, 2011 9:59 AM

శ్యామలీయం చెప్పారు...

    సంపత్కుమారులవారూ,
    పాలు + అభిషేకము --> పాలాభిషేకము సవర్ణదీర్ఘ సంధి. ఇది చెల్లదు.
    ఇలా, తెలుగు సంస్కృత పదామధ్య సంధి చేయటం కుదరదు.
    సవర్ణదీర్ఘ సంధి కేవలం రెండు సంస్కృతపదాల మధ్య జరిగే సంధి.
    December 03, 2011 10:02 AM

మిస్సన్న చెప్పారు...

    శ్రీ శ్యామలీయమ్ గారు శ్రీ రామ్ మోహన శర్మ గార్లు
    కొద్దిగా సంయమనం పాటిస్తే వారి చర్చల ద్వారా మిత్రులందరికీ
    అమూల్యమైన భాషా జ్ఞానాన్ని అందించిన వారవుతారు.
    December 03, 2011 10:12 PM

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

    ఈ చర్చను ఆలస్యంగా ఈరోజే (24-05-2012) చూసాను.
    రాంమోహన శర్మ గారి వాదన కొంత వరకు పండితులు అంగీకరించిందే. అయితే అది పూర్తిగా ఆమోదయోగ్యమయిన వాదన కాదు. "’పాలాభిషేకం’ సవర్ణ దీర్ఘ సంధి కాబట్టి తప్పు - అంతే కాని, తెలుగుపై సంస్కృతం రావడం వలన కాదు" అన్నారు. మరి ఉత్వ సంధి చేసి .. ’పాలభిషేకం’ అంటే సాధువవుతుందా? ’నల్ల బంగారం’ను ’నల్ల స్వర్ణం’ అంటే బాగుంటుందా? ’బుద్ధి హీనులు’ అని కాకుండా ’తెలివి హీనులు’ అంటే అందరూ ఆమోదిస్తారా? ఇవన్నీ తెలుగు సారస్వత రంగంలో -నిక్కచ్చిగా ఉండే పండితులకు, కొంత ఆధునిక దృష్టితో వెసులుబాటు కోరుకొనే పండితులకు మధ్య ఫలితం తేలకుండా  తరతరాలుగా సాగుతున్న చర్చనీయాంశాలు. శ్రవణ సుభగమైతే కొన్ని సార్లు తెలుగుల మీద సంస్కృతాలను కొందరు పండితులు ఆమోదిస్తున్నారు. అందులో నేనూ ఒకణ్ణి. ఎందుకంటే నా దృష్టిలో భాష - నిశ్చల పర్వతం కాదు .. ప్రవహించే జీవ నది. ఈ విషయాన్ని పండితులంతా గమనిస్తే మంచిది.
    అంతో.. ఇంతో పాండిత్యం గల రాంమోహన శర్మ గారు పిల్లులు, ఎలుకల సామెతలు చెప్పడం శోభించదు.
    May 24, 2012 9:20 PM "

17 కామెంట్‌లు:

  1. ఈ పండిత చర్చలో పాల్గొనే అర్హత లేకపోయినా ,నా అభిప్రాయాలు చెబుతున్నాను.1.పాలాభిషేకం అని సంధి చేయడం తప్పే.పాల అభిషేకం అనవచ్చును.2.తెలుగు పదం తర్వాత సంస్కృత పదం తో సమాసం చేయవచ్చునుగాని ,సంస్కృత పదం తర్వాత తెలుగు పదంతో సమానం చేయకూడదు.ఇది జనరల్ రూల్.కాని మినహాయింపులు ఎప్పుడూ ఉంటాయి.ఆరుద్ర 'రామ చక్కని ' అనే ప్రయోగాన్ని సమర్థించేరు.3.సందేహం కలిగినప్పుడు ప్రాచీన మహాకవుల ప్రయోగాలను అనుసరించ మన్నారు.4.ఒకరు చెప్పినట్లు శ్రవణ సుభగత్వం కూదా చూదాలి.5.ఐనా పండిత చర్చలో కొంత సం యమనం పాటించాలి కదా.

    రిప్లయితొలగించండి
  2. కమనీయం గారు!
    దాదాపుగా నా అభిప్రాయాన్నే మీరు చెప్పారు.
    అయితే .. ’పాల అభిషేకం’ అన్నది వ్యవహారంలో చెల్లుతుంది. కాని మన చర్చ పద్య కవిత్వానికి సంబంధించిన గ్రాంథిక భాష. అక్కడ మధ్యలో అచ్చుతో ఆ మిశ్రమ సమాసాన్ని పండితులు ఆమోదిస్తారా ?
    మిగితా విషయాల్లో మీరు చెప్పింది .. నేను చెప్పింది ఒకటే.
    నేనందుకే ఇలాంటి విషయాల్లో చాల సార్లు ’శ్రవణ సుభగత్వం’తో బాటు, రస దృష్టితో కూడా చూడాలని చెప్పుతూనే ఉన్నాను.
    రస ప్రధానంగా సాగితే ఇలాంటివి "కవి తెలిసే ప్రయోగించాడులే!" అని పండితులు మన్నిస్తారు. ’రామ చక్కని’ ప్రయోగం అలాంటిదే!
    కాని పాఠాలు చెప్పినప్పుడు అన్నీ ఇలాగే ప్రయోగించమని చెప్పలేం కదా!
    అప్పుడు జనరల్ గా చెప్పుతాం. ఈ సంగతి గ్రహించకుండా, రాంమోహన్ శర్మ గారు సంయమనం కోల్పోయి ’శ్యామలీయం’ గారిపై, శంకరయ్య గారిపై దాడికి దిగడం నన్ను బాధించింది.
    అయినా ఈ విషయాన్ని నేను ఆరు నెలల తరువాత తిరుగ దోడి ఇలా టపాగా ప్రచురించింది రెండు కారణాలతో -
    ఒకటి ... ఆరు నెలలు గా ఈ విషయంలో అయోమయంలో ఉన్న కొందరు యువ కవి పండితులకు స్పష్టత కలిగించాలని. ( నా టపా, మీ వ్యాఖ్య ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించాయి.)
    రెండు .. రాంమోహన్ శర్మ గారు సుహృద్భావంతో ఇంకా ఏమైనా చర్చించాలనుకొంటే .. నేను భాషాభిమానంతో రసవంతమయిన చర్చకు సిద్ధం అని తెలియజెప్పడం.
    అంతే కాని ఇక్కడ సంయమనం కోల్పోయి యుద్ధాలు చేసేంత అవసరం నాకు లేదని మీరు అర్థం చేసుకొంటారని భావిస్తున్నాను.
    పెద్దలుగా మీ అభిప్రాయం అందించినందుకు మీకు నా ధన్యవాదాలు! అభివాదాలు!

    రిప్లయితొలగించండి
  3. మంచి చర్చ. ఇదివరకెప్పుడో రాళ్ళపల్లి గారు ఇలాంటివి కొన్ని చెప్పినట్టు గుర్తు. తమిళంలో ఇలాంటిప్రయోగాలు ఉన్నవా అని నా మిత్రులొకరితో కనుక్కునే ప్రయత్నంలో ఉన్నాను. దొరికితే తెలియజేస్తాను.

    రిప్లయితొలగించండి
  4. ఆంగ్లపదాలకు దీటుగా కొత్త తెలుగుపదాల్ని కల్పించే ప్రయత్నంలో మేము గత అయిదేళ్ళుగా ఎక్కువ వైరిసమాసాల్నే కూర్చుతున్నాం. వాటినే ప్రోత్సహిస్తున్నాం. అందఱికీ భాషని అందుబాటులోకి తేవాలంటే, అందఱినీ పదకల్పనానిపుణులుగా మార్చాలంటే ఇది తప్పదు. అందఱికీ సంస్కృతపదాలు తెలీవు. నేర్చుకోమని మనం బలవంతం చేయలేం. కనుక సరే ! కలిపికొట్టండి అని సలహా ఇస్తున్నాం.

    రిప్లయితొలగించండి
  5. తాడేపల్లి గారు!
    వచనంలో కుదురుతుందేమో గాని, పద్యంలో అది... ఏమో - రస పుష్టిని పెంచేట్టయితే ఆలోచిద్దాం!
    మీకు ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  6. తెలుగేడ ? సంస్కృతంబే
    పలుకుల , వ్రాతలను జేరి , పదపదమున తా
    విలసిల్లు చుండ , నింకను
    తెలుగని సంస్కృతమనియెడు తేడా కలదా ?

    సంస్కృతమ్ము తెలుగు సమసించగారాదు ,
    సంధి చేయరాదు , చాల తప్పు
    పండితులయు - ప్రజల భాషలు వేరయ్యె
    పద్య మెవరి కొఱకు ? పండితులక ?

    వ్యాకరణ ప్రయోజనమే
    ప్రాకటముగ వ్రాయ , జదువ , భాషించుటలో
    సౌకర్యము , సౌలభ్యము
    చేకూరుటకే యనుటను చేకొనరు గదా !

    వ్రాతల , మాటాడుటలన్
    ప్రాత విథానములు మారు , భాషయు మారున్
    తాతల నాటిది వ్యాకృతి
    చేతులు జోడింతు మార్పు జెందద విబుధా !

    పండితులు గొప్పలకు బోయి , బాధ్యతలను
    మరచి , గీర్వాణ మెంచి , యేమార రెపుడు
    ప్రజలు మాటాడు భాష చేపట్టి నపుడె
    రచన చదువరి కర్థమై రాణ కెక్కు .

    ----- బ్లాగు సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  7. వెంకట రాజారావు గారు!

    తెలుగు భాషతో పెనగూడి దేవభాష
    జంట నాగుల వలె నాట్య జతులు పాడు
    నవ్య మార్గము జూపెగా నన్నయ కవి
    పామరులె గాదు మెచ్చగా పండితులును!

    పండితునకె గాదు - పామరునకె గాదు -
    పద్య మెవరి కొరకు వ్రాయును కవి?
    పదము పదము గ్రోలి బ్రహ్మాండమైనట్టి
    రస వినోదమొందు రసికు కొరకె!

    వ్యాకరణంబే కవికిని
    కాకూడ దొక గుదిబండ కవన పథములో -
    నా కవితావేశమునకు
    నా కది యొక పట్టుగొమ్మ నా భావనలో!

    మీకు నా ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  8. వెంకట రాజారావు గారు!
    మరొక పద్యం ...

    సారళ్యంబది వేరే!
    భీరువు వలె వ్యాకృతికిని వెరచుట వేరే!
    సారస్వతమున ధీరు డ
    కారణ భంగమును దాన గలిగింపడయా!

    ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  9. కమనీయంగారూ, పండిత చర్చలో సంయమనం పాటించాలి కదా అన్న మీ సూచన ఉచితం.

    ఆచార్య ఫణీంద్రగారూ, "రాంమోహన్ శర్మ గారు సంయమనం కోల్పోయి శ్యామలీయం గారిపై, శంకరయ్య గారిపై దాడికి దిగడం నన్ను బాధించింది" అన్నారు. బహుశః శ్రీశర్మగారు తన అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్పాలనుకుని అట్లా వ్రాసి యుండవచ్చును గాని ఆ ధోరణి "దాడి"గా కనిపిస్తుందని వారనుకోక పోవచ్చును.

    తాడేపల్లివారు, అందరకూ సంస్కృతం తెలియకపోవటం అటుంచి, యీనాడు తెలుగులో కూడా తగినంత పరిజ్ఞానం ఊండటం లేదు కదా దురదృష్టవశాత్తు. నిజానికి నా సంస్కృతపరిజ్ఞానం ప్రశ్నార్థకమే!

    రాజారావుగారూ, ఊరికి కరణమూ భాషకు వ్యాకరణమూ శత్రువులని ఒక నానుడి ఉంది. వాదనలకు చాలినంత పాండిత్యగరిమ కలవాడను కాను. కాని ఒక్క ముక్క మనవి చేసుకుంటాను. ప్రజలు మాట్లాడు భాషనుండి ప్రయోగాలను స్వీకరించి ప్రామాణీకరించి వ్యాకరణాన్ని గుర్తించటం జరుగుతుంది. మీరన్నట్లు భాష రకరకాల కారణాలవల్ల మార్పులు చెందుతుంది స్థూలంగా - కాని మూలస్వభావం మారుతుందనుకోను. ఎప్పటి కాలానికి అప్పుడు రంజుగా ఉండేలా కవులు కళాకారులూ భాషను వాడుక చేస్తూ పోతుంటే సాహిత్యం అనేది కేవలం సమకాలీనవ్యవహారమే కాని నాలుగుకాలాలు నిలిచే విషయం కాకుండా పోతుంది కాబట్టి కొంత ప్రామాణిక భాషను గుర్తించి వాడటం తప్పదు. సాహిత్యం నాలుగు కాలాలు నిలిచి ఉండకపోతేనేమి అనుకుంటే సమస్యే లేదు. సరిపెట్టుకోవటమో, నవ్యతాప్రియత్వమో కారణంగా భాషకు యే ప్రామాణికతానిబంధనలూ అక్కరలేదనుకుంటే అది భాషకు, తత్సాహిత్యానికి దీర్ఘకాలంలో చేటు తెసుందేమో నని నా అనుమానం.

    రిప్లయితొలగించండి
  10. తమిళంలో "నల్లకాలం", "కెట్టకాలం" అన్న శబ్దాలు ప్రాచీన కావ్యాలలో ఉపయోగింపబడినట్టు మా మిత్రులు చెప్పారు. అలాగే మాణిక్యవాచకర్ అనే శైవపండితుడి కావ్యం పేరు "తిరువాచకం" అని తమిళంలో ఉన్నదిట. (మాణిక్యవాచకర్ వారి విగ్రహం కాళహస్తి దేవాలయంలో చూడవచ్చు). తమిళంలో ఇలాంటి ప్రయోగాలకు అభ్యంతరం లేదన్నట్టు వినికిడి.సంస్కృతానికి జోడించిన తమిళశబ్దాలు అనేకం ఉన్నాయిట. (ఉదా:- విషచ్చెడి)

    రిప్లయితొలగించండి
  11. ప్రజల విడిచిన సాహిత్య విజయ మేమొ ?
    నా కవగతము గాదు , ఙ్ఞాన ప్ర పూర్ణు
    లైన పండితుల కయిన నర్థ మగునొ !
    లేదొ ? శారదా దేవి యాలించు గాక !

    వినుడు , వేమన్న పద్యాలు జనములోకి
    దూసుకొని వచ్చి బుధులకు దురద తీర్చె
    పద్య మిభ్భంగి ప్రజలలో బ్రతుక వలయు
    ప్రజల భాషయే దీనికి ప్రాతి పదిక .

    తెలుగు నుడుల తీపు తలపుకు రాదేమి !
    గ్రామ్య మనుచు పద్య రచన లోన
    సాధు చర్చ జేసి చంపుట న్యాయమా ?
    పలుకు బడిని కించ పరతు రేల ?

    మడి గట్టుక కూర్చుండిన
    చెడి పోవును తెలుగు భాష , చెడు పద్యంబున్
    గడుకొని పరికింపుడు తెలు
    గడుగడుగున జన పదముల నలరారుటలన్ .

    పాత పుస్తకాల పదజాలమే గాని
    ప్రజల పలుకు పడదు పండితులకు
    పాడు బడిన నూత బడి యుండుటే గాని
    పారు టేటి నీరు పనికి రాదు .

    ----- సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  12. రాజారావు గారు!

    వ్యాకృతి సూత్రముల్ విడిచి నట్లయినన్ ప్రజ చేరు వౌటయా?
    ఆ కవి వేమ భూపతియు వ్యాకృతి భంగము చేసె నెచ్చటన్?
    వ్యాకృతి సూత్రముల్ నిలిపి, వాక్యములన్ సరళంబునౌ పదాల్
    చేకొని పద్య సృష్టి నిల చేయగ లేమొకొ తేట తేటగాన్?

    సరళమునౌ గ్రాంథికమున
    విరివిగ పద్యాల జేసి పేర్గాంచిరి బ
    మ్మెర పోతన, వేమనయున్,
    కరుణశ్రీ - వ్యాకృతి పయి గౌరవ మెసగన్!

    ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  13. రాజా రావు గారు!

    తెలుగు, గీర్వాణముల కలగలిపి మీరు
    వ్యాకృతిని గౌరవించుచు వ్రాసినారు
    తెలుగు పద్యములను పైన తేటగాను!
    ప్రోక్తమునకు, వ్రాత కిటు వైరుధ్య మేల?

    రిప్లయితొలగించండి
  14. శ్యామలీయం గారు!
    చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  15. ఈ సాహిత్య ఝరీ ప్రవాహం చదువుతూ ఉంటే నాకు కళ్లు తిరుగుతున్నాయి. జ్ఞాన గని - లు , జ్ఞాన ఘనులు పోస్ట్ చేస్తున్న విషయాలు నా వంటి పామరులకు, కవి ప్రారంభీకులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. బ్లాగు వారికి ధన్యవాదములు.ఆచార్య ఫణీంద్ర గారికి పాదాభివందనములు.

    రిప్లయితొలగించండి